విజయవాడలో సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు

  • గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండైన సీఐ నాగరాజు 
  • విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని నివాసంలో సీఐని కస్టడీలోకి తీసుకున్న అధికారులు
  • నాగరాజును తరలిస్తుండగా అడ్డుకునేందుకు యత్నించిన అనుచరులు
  • పోలీసులకు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన కృష్ణలంక సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు, విచారణ నిమిత్తం నాగరాజును కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న నాగరాజు మద్దతుదారులు, అనుచరులు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సిట్ అధికారులు నాగరాజును తమ వాహనంలో కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేయగా, వారు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సీఐ నాగరాజు మద్దతుదారులు విజయవాడలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. 

గాదె సాయికృష్ణను మే 9వ తేదీన సీఐ నాగరాజు బృందం అదుపులోకి తీసుకుందని, అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కస్టడీలో చిత్రహింసల వల్లే సాయికృష్ణ మృతి చెందాడని, మృతదేహాన్ని కూడా మాయం చేశారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపడంతో, ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో భాగంగానే సిట్ అధికారులు తాజాగా నాగరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

CI Nagaraju
SIT Vijayawada
Gade Sai Krishna case
Vijayawada Police news
Krishnalanka CI suspension
Custodial death probe

More Telugu News